Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

మతములు - మతాచార్యులు

ఒక మతముయొక్క బలము - ఆమతములోనిగురువుల యొక్కయు, ఆమతమును అవలంబించెడి జనులయొక్కయు నిజాయితీ, శీలము, ఆధ్యాత్మిక ఔన్నత్యము - వీనిపై ఆధారపడి యుండును. ఇన్ని ఆపదలను ఎదుర్కొని నేటికిని వేదమతము మనదేశమున నిలిచియున్నదనిన, ఒక్కొక్క కాలమందును మనమతమం దుద్భవించిన ఆచార్య పురుషులే అందుకు కారణము.

దాదాపు 2500 సంవత్సరముల క్రితము కపిలవస్తు నగరమున బుద్ధు డుదయించెను. ఆయన తన జీవితమున చేసిన మహోన్నత త్యాగము, ¸°వనదశలోనే అవలంబించిన సన్యాసము - అందరి మనస్సులను ఆకం్షించెను. బుద్దచరిత్రను చదువునపుడుగాని, ఆయన విగ్రహములను చూచినపుడుగాని మనసులలో ఒక అనిర్వచనీయమైన శాంతి, కరుణ, ఆనందము మనకు కల్గుచున్నది. సాధారణముగా బౌద్దమతము నాస్తిక మతమనియు, అందుచేమన దేశమునుండి వెళ్ళ గొట్టబడినదనియు మనలో చాలామంది అనుకొందురు. కాని, సంస్కృత పాలీ భాషలలోని బౌద్ద గ్రంథములును అశోకుని శిలాశాసనములును - బుద్ధుని విశాలహృదయత గొప్పదనము మనకు వెల్లడి చేసినవి. ఇట్టి మహానుభావుడు మనదేశమున జన్మించుట గర్వించదగినవిషయము. ఆంగ్లమున - ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ అనెడు కవి 'లైట్‌ ఆఫ్‌ ఏషియా' అనెడు పద్యగ్రంథమును వ్రాసెను. అదియే బుద్దచరిత్ర. బౌద్ధమతము తమిళ##దేశమున వ్యాపించుటచే తమిళ గ్రంథములలో బౌద్దప్రస్తావన కలదు. వీని మూలముగా బౌద్ధమతమునందు మనకు ప్రేమ, గౌరవములు కలగుచున్నవి. అయినచో ఈ మతమెందులకు మనదేశమునుండి బహిష్కరింపబడినది?

తమిళ##దేశమున బౌద్దము, జైనములందు అభిమానమెక్కువగా నుండెడిది. జైనమతగ్రంథములును తమిళమున ఎక్కువ. గుజరాత్‌ నందును, ఉత్తరహిందూస్తానమున మరి కొన్ని ప్రదేశములందును జైనమతము వ్యాప్తిలో నుండినది. జైన బౌద్ధమతముల రెండింటికిని 'అహింసా పరమోధర్మః,' అనునది ముఖ్యతత్త్వము. కాని బౌద్ధులు జైనులంతఅహింసా తత్పరులు కారు. వారు జంతువులను చంపరుగాని, ఇతరులచే చంపబడిన జంతువుల మాంసము తినగూడదను నిర్బంధము వారికిలేదు. జైనమతమునకు చెందన విగ్రహ. శిల్పములు మనదేశమందెన్నో కలవు. పురాతన మతములలో సాంఖ్యము గొప్పమతము. బౌద్ధ జైనములకంటె సాంఖ్యమున జ్ఞానులు, తపస్వులు ఉన్నప్పటికిని, వారి విగ్రహములుకాని, కథలు పాటలు, వాజ్మయముగాని ఏవియును మనకు కనపడవు. కాని వేదాంతగ్రంథములలో జైన బౌద్ధములకంటే సాంఖ్యమత ప్రస్తావన ఎక్కువగా చేయబడినది.

శైవ, వైష్ణవ సిద్ధాంతములను రెండు తెగలు వైదిక మతమునకు చేరినవి. దక్షిణాదిలో ఈనాటికిని ఇవి వాడుకలో నున్నవి. వైష్ణవ సిద్ధాంతమునకు ఆచార్యులు శ్రీరామానుజులు. ప్రతి వైష్ణవ దేవాలయమందును రామానుజులు, నమ్మాళ్వారు, మనవాళమహాముని, వేదాంతదేశికులు, ఇతర ఆళ్వార్ల విగ్రహములు ప్రతిష్టించియుందురు. శివాలయములలో అప్పర్‌, సుందరస్వామి సంబంధులు. మాణిక్యవాచకస్వామి - మొదలగువారి విగ్రహములుండును. (వీరేకాక ముఖ్యమైన శివాలయాలలో 63 నయనార్లవిగ్రహములుండును.) వైష్ణవప్రబంధములు, శైవ తిరుమురై - అనుసరించి ఆలయమున పూజాదికములు జరుగుటకు భూదానము లొనర్పబడినట్లు ఆలయములందరి శిలాశాసనములు తెలుపుచున్నవి. కాని ఈశ్వరవైష్ణవ భక్తులకు విగ్రహములున్నట్లు అద్వైతమునకు చెందిన ఆదిశంకరులకు వేయిలో నొక్కభాగమైనను ఉండదు. వారి సంప్రదాయమున వచ్చిన విద్యారణ్యులు, సురేశ్వరాచార్యులు, అప్పయ్యదీక్షితులు - మొదలైనవారికిన్ని విగ్రహములు లేవు. ఒకపుడు ఆర్కేలాజికల్‌ శాఖకుచెందిన ఒక ఉన్నత ఉద్యోగి 'శిలాశాసనములు, విగ్రహములు తదితర ప్రాచీనసాక్ష్యముల నుండి మనము చరిత్రను తిరుగవ్రాయవలసి వచ్చినచో, అట్టి చరిత్రలో - ఆదిశంకరులనుగూర్చి ఒకమాటయేని ఉండదని యనిరి.

ప్రతి మతప్రవక్తయు తన కాలముననున్న మతములను ఖండించి, తనమతమే గొప్పదని స్తుతించును. ఇట్లే బౌద్ధము వేదమునుఖండించెను. వైష్ణవశైవసిద్ధాంతములందు ఒక విశేషమున్నది. ఇవి రెండున్ను విగ్రహారాధనను అంగీకరించును కాని మూర్తి ఉపాసనయందు వైష్ణవము కరచరణాద్యంగములుకల మూర్తి ఉపాసననే నిర్దేశించును. శైవమునందు విగ్రహము భగవత్సూచకమును, నిరవయవమును అగు లింగముమాత్రమే. ఇస్లాం, క్రైస్తవ మతస్తులు, ఆర్యసమాజస్థుల విగ్రహారాధనను దూషింతురు, హైందవము వేదములపై ఆధారపడగా, జైన బౌద్దములు వేదమును నిరాకరించినవి. ఈ ఆచార్యులలో ప్రతియొక్కరు తమతమ కాలములలో తమతమ పక్షమునకు ఎంతో మందిని ప్రోగుచేసికొనిరి.

ప్రపంచమున నేటి మతస్థితిని పరిశీలించిన దాదాపు సగము జనాభా క్రైస్తవమును, సగము బౌద్ధమును అనుసరించునట్లు దోచును. ఎన్నో మతములు పుట్టి క్షీణించినవి. వాని ఉత్పత్తి క్షీణతలకు కారణములేవి? ప్రతిమతమును పుట్టినపుడు సత్యమునకు తానే హక్కుదారు అని అనును. నిజమైన మతమునకు తానే నిదానమని యనును. సత్య మొక్కటియే కాని రెండుకాదు. ఐననూ, మతప్రవక్తలలో ప్రతి ఒక్కరున్నూ ఎన్నో జనులను - అవలంబకులను సంపాదించుకొన్నారు. ఒక మతములోని గొప్పదనమునుగాని, సత్యమునుగాని ఎట్లు నిర్ణయించుట? ఆ నిర్ణయము మతస్థుల సంఖ్యపై ఆధారపడియుండునా? అయినచో సత్యమునకు నిధులమని చెప్పుకొనే మతములు ప్రజారంజకముగా ఎందులకు ఉండటము లేదు?

ఒక మతము ప్రజారంజకముగానున్నదనిన, అది అందలి సత్యముచేతనా? మతము సత్యమైన ప్రజలు దానిని అవలంబింతురా? సత్యము అంతరించిన మతమున్ను అంతరించునా?

బౌద్దమత క్షీణతకు కారణము ఆ మతస్థులయొక్క లోపములే. ముఖ్యముగా నితరులకు మార్గదర్శకులుగా నుండవలసిన భిక్షువులు తమతమ మతధర్మములను శ్రద్ధగా పాటించక పోవడమే కారణము. అదేవిధముగా ఒక మతము ప్రబలమగుచున్నదనిన, అందలి మతాచార్యులు వారిశుద్ధజీవనముచే ఇతరులకు మార్గదర్శకులగుచు ఆధ్యాత్మికోన్నతితో విశాల హృదయులై యుండుటచేతనే. ఒక మతమునకు ప్రోద్బలము - అది ఆచార్యుడు ఇచ్చినప్పటికిని, దాని తర్వాతి వృద్ధిక్షయములు - తరువాతి ఆచారపరంపరయొక్క భక్తి శీలములపై, నిర్మలజీవితాలపై ఆధారపడియుండును. మతప్రవక్తమహాత్ముడయినచో జనానీకమూ అతనినే అనుసరిస్తుంది. ఆ ఆచార్యుని మతములో సత్యమున్నదా లేదా అన్న విచారణ చాలా అరుదుగా ఉంటుంది. సత్యవస్తు విచారణ సాధారణముగా తార్కికము. అది ఏ మేధాశాలురో చేయవలసినపని. అందుచేకొన్ని మతములు వ్యాప్తిలోనుండి, ప్రజాదరణ నశించి, విస్మృతములయినవనిన ఆ మతాచార్యుల శీలలోపమే కారణము.

అందుచే మతము శక్తిమంత మగుటకు మతమును అందరూ చక్కగా శ్రద్దగా నుష్టించవలెను; మతధర్మములను పాటించవలెను. మతపు నిలుకడ - సంఖ్యపైగానీ, ఆడంబరము మీదగాని ఆధారపడదు. సాంఖ్యము, అద్వైతము అన్ని మతములకంటెను నిరాడంబరములు. నేటికిని వైదికమత మున్నదనిన, దీనిలో ఒక్కొక్క కాలమునందును పుట్టిన మహాపురుషులు, దివ్యగుణసంపన్నులు, స్వచ్ఛశీలులు, స్వార్థత్యాగులు, శ్రద్ధాభక్తులతో మతాచారములను పాటించుట వలననే. అందుచే మన మతము ఆదర్శప్రాయముగా నుండవలెనన్న మన మందరము సుశీలముకల్గి, శాంతులమై, భక్తియుక్తులమై మన మతధర్మములను త్రికరణశుద్ధిగా చక్కగా అనుష్టించవలెను. మనలో ఒక్క మహనీయుడున్న చాలును. లోకకల్యాణము నాతడు నిస్సందేహముగా ఘటింపగలడు.


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page